.jpg)
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సోమవారం మధ్యాహ్నం భారత వాయుసేన చీఫ్ మార్షల్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని నడిపించారు.
ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాక్ వాయుసేనకు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాన్ని వెంటాడి కూల్చివేసిన తరువాత పాక్ ఎదురుదాడిలో ఆయన నడిపిస్తున్న మిగ్-21 యుద్దవిమానం పాక్ సరిహద్దులలో కూలిపోయింది. పాక్ సైనికులు ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ ఆయన దేశ సైనిక రహస్యాలను బయటపెట్టలేదు. అందుకుగాను భారత్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకంగా పరమ్ వీర్ చక్ర అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే.
ప్రపంచదేశాల ఒత్తిడి కారణంగా పాకిస్థాన్ ఆయనను తిరిగి భారత్‌కు అప్పగించిన తరువాత సైనిక నియమనిబందనల ప్రకారం వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేసి, ఆయన గతంలోలాగే శారీరికంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని దృవీకరించడంతో వాయుసేన ఆయనను మళ్ళీ విధులలోకి తీసుకొంది. ఇవాళ్ళ మళ్ళీ మిగ్-21 నడిపించేందుకు అనుమతించింది.
త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా స్వయంగా అభినంధన్ వర్ధమన్‌తో కలిసి ఈరోజు మధ్యాహ్నం పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు మిగ్-21 నడిపించారు.
అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మీడియాతో మాట్లాడుతూ, “గతంలో నేను అభినందన్ వర్ధమాన్ తండ్రిగారితో కలిసి పనిచేశాను. ఆయనతో కలిసి ఇదే మిగ్-21 విమానంలో చాలాసార్లు ప్రయాణించాను. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత నా స్నేహితుడి కుమారుడితో కలిసి మిగ్-21లో తిరిగిరావడం నాకు చాలా సంతోషంగా ఉంది.
కొన్నేళ్ళ క్రితం నేను ఇదే మిగ్-21 యుద్దవిమానంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొంటే, అభినందన్ వర్ధమాన్ బాలాకోట్ ఎదురుదాడిలో పాల్గొన్నారు. శత్రువుల చేతిలో చిక్కినప్పటికీ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అభినందన్ వర్ధమాన్ దేశానికే గర్వకారణంగా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తితో నా ఉద్యోగంలో చివరిసారిగా మిగ్-21లో ప్రయాణించే అవకాశం లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.