త్వరలో అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ ఇంతవరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదు. కనుక ఈ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. 

బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే సిఎం కేసీఆర్‌ ఆర్ధికశాఖతో సహా అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశమై అవసరమైన సలహాలు సూచనలు చేశారు. కేసీఆర్‌ సూచనల మేరకు అధికారులు బడ్జెట్‌ను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా ఖరారు అయినందున వాటికి ఒకరోజు ముందుగా అంటే సెప్టెంబర్ 8వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ ముసాయిదాకు ఆమోదం తెలుపుతారు. 

ఈసారి ఆర్ధికమంత్రిత్వశాఖను సిఎం కేసీఆర్‌ తనవద్దే అట్టేబెట్టుకున్నారు కనుక ఆయనే స్వయంగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. సమావేశాల తొలిరోజున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించడానికి వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శాసనసభ బీఏసీ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి? చర్చించవలసిన అంశాలను ఖరారు చేస్తారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు, సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించబోతోంది.