ప్రాజెక్టులా...పర్యాటక కేంద్రాలా...ఏందీ లొల్లి?

కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరుగుతోందని వాదిస్తున్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసి కడుతున్న ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువని వాదిస్తున్నారు. తమ వాదనలను సమర్ధించుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు తుమ్మిడిహెట్టి పర్యటనకు వెళ్ళి అక్కడ ప్రాణహిత నది నీటి లభ్యతను పరిశీలించినా తరువాత మళ్ళీ మరోమారు తమ వాదనలను వినిపించి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మాత్రమే పనికివస్తుందని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి పొంగిపోతున్న తెలంగాణ ప్రజలు కూడా బహుశః కాంగ్రెస్‌ నేతల మాటలను జీర్ణించుకోవడం కష్టమే. అటువంటిది ఆ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెరాస నేతలు భరించగలరనుకోలేము. కనుక వారు కూడా కాంగ్రెస్‌ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఏదో కాలక్షేపానికి తమ్మిడిహెట్టి పర్యటనకు వెళ్ళే బదులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఉండి ఉంటే వారికి నిజాలు తెలిసి ఉండేవి కదా? అని ఎద్దేవా చేశారు. కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే కాంగ్రెస్‌ నేతలు తమ్మిడిహెట్టికి వెళ్లారని వినోద్ కుమార్ విమర్శించారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మళ్ళీ స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు అనడం కంటే పర్యాటక ప్రాజెక్టు అనడమే సబబు. దానిపై చేసిన ఖర్చులకు సంబందించి సమగ్ర నివేదికను కేంద్రప్రభుత్వానికి ఇస్తే తమ అవినీతి బయటపడుతుందనే భయంతోనే తెరాస సర్కార్‌ దానిని దాచిపెడుతోంది. కదనుకుంటే తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్‌ను బయటపెట్టి, కేంద్రప్రభుత్వానికి అందజేయాలి. ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ పంతానికి పోకుండా తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించినట్లయితే రైతులకు సకాలంలో నీళ్ళు అంది ప్రయోజనం కలుగుతుంది,” అని అన్నారు.