
మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గంలో నుంచి తప్పించబోతున్నారంటూ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గురువారం హుజూరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తెరాస కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నానని, బీసీ కోటాలో మంత్రిపదవి ఇవ్వాలని కోరినట్లు కొందరు చిల్లర ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఏనాడూ పదవుల కోసం పైరవీలు చేయలేదు. ఉద్యమసమయంలో గులాబీ జెండాను భుజాలపై మోసి పైకి ఎదిగిన వ్యక్తినే తప్ప హటాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడినవాడిని కాను. కనుక నేను పదవుల కోసం ఎవరినీ అడుక్కోనవసరం లేదు. సొంతంగా ఎదగలేనివారే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అటువంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్రతికినంతకాలం నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతకడమే నాకు తెలుసు. ఏనాడూ ఎవరి దగ్గర పైసలు కోసం చెయ్యి చాచింది లేదు. కనుక నన్ను ఎవరూ వేలెత్తి చూపలేరు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు కనుక ఎవరి చేత నీతి పాఠాలు చెప్పించుకోవలసిన అవసరం మాకు లేదు,” అని ఈటల రాజేందర్ అన్నారు.
ఈటల ప్రతిపక్ష నేతలను ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా, పార్టీలో అంతర్గతంగా కూడా ఆయన ఏవో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో మంత్రిపదవులకు చాలామంది ఆశావాహులు ఉన్నందున కొత్తవారికి చోటు కల్పించేందుకు మంత్రివర్గంలో నుంచి ఇద్దరు మంత్రులను తొలగిస్తారని, వారిలో ఈటల రాజేందర్ ఒకరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి గురించి ఈటల మాట్లాడిన మాటలు వింటే పార్టీలో ఆ పదవి ఆశిస్తున్నవారెవరితోనో ఆయన ఇబ్బంది పడుతున్నట్లున్నారు.