పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనలో కేసీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించేందుకు సిఎం కేసీఆర్‌ గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. ఈరోజు పర్యటనలో కరివెన, వట్టెం, నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి, ప్రాజెక్టు నిర్మాణంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాఫ్టర్‌లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.  

రూ. 35,200 కోట్లు అంచనా వ్యయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూసేకరణ కోసం రూ.5,880 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు మొదటిదశ పనులు పూర్తి చేయడానికి కనీసం రూ.12,000 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేయడంతో దానిలో రూ.10,000 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఆ నిధులతో వచ్చే ఏడాది ఖరీఫ్ సీజనులోగా ఈ ప్రాజెక్టులోని కాలువలు, పంప్‌హౌస్‌లను నిర్మించి మొదటి దశలో 7 లక్షల ఎకరాలకు ఒక టీఎంసీలు నీటిని అందించాలని సిఎం కేసీఆర్‌ లక్ష్యంగా నిర్దేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి పెట్టారు కనుక ఇకపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం కావచ్చు.