
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుదవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా వైద్యుల సంఖ్య పెరగవలసిన అవసరం ఉన్నందున కొత్తగా 75 వైద్యకళాశాలలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటి ద్వారా ఏటా అధనంగా 15,700 మెడికల్ (ఎంబీబీఎస్) సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 2021-22 లోపుగా వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కనుక వీటిలో ఏ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజీలు కేటాయించబడతాయో, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో చూడాలి.
దేశంలో చెరుకు రైతులను ఆదుకోవడానికి మంత్రివర్గం కీలకనిర్ణయం తీసుకుంది. దేశంలో మిగులు చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 2019-20 సీజన్ నుంచే 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎగుమతి చేసిన చక్కెరపై మొత్తం రూ.6,000 కోట్లు రాయితీలను నేరుగా ఆయా రైతుల ఖాతాలలోనే జమా చేస్తామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.