
కశ్మీర్ విభజన, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు చేపట్టింది. వాటిపై కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోరుతూ కేంద్రప్రభుత్వానికి, జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. అక్టోబర్ మొదటివారంలో ఈ పిటిషన్లన్నిటిపై ఒకేసారి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు.
కశ్మీర్‌లో నేటికీ కర్ఫ్యూ, మీడియాపై ఆంక్షలు కొనసాగించడం, ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ప్రజలు, మీడియా కేంద్రప్రభుత్వంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎడిటర్ అనురాధ బేసిన్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు సమస్యలపై వారం రోజులలోపుగా జమ్ముకశ్మీర్, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.