
ఒకప్పుడు యావత్ దేశ ఆర్ధిక వ్యవస్థను తన కనుసన్నలలో నడిపించిన మాజీ కేంద్రఆర్ధికమంత్రి పి చిదంబరంకు ఊహించని కష్టాలు మొదలయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మరింత లోతుగా ప్రశ్నించేందుకుగాను ఆయన కస్టడీని పొడిగించాలనే సిబిఐ అభ్యర్ధనకు సిబిఐ కోర్టు సానుకూలంగా స్పందిస్తూ ఆగస్ట్ 30 వరకు సిబిఐ కస్టడీని పొడిగించింది.
ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నందున ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు అనర్హంగా మారిందని చెపుతూ సుప్రీంకోర్టు కూడా బెయిల్‌పై నిరాకరించడంతో చిదంబరంకు సిబిఐ కస్టడీలో గడుపక తప్పడం లేదు.
అయితే ఈడీ వేరేగా జారీ చేసిన అరెస్ట్ వారెంటును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తూ మంగళవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ, ఈడీ అరెస్ట్ వారెంట్లపై చిదంబరం మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.
సిబిఐ కస్టడీ నుంచి విడుదల కాకమునుపే ఈడీ ఆయన అరెస్టుకు సిద్దంగా ఉన్నందున అప్పుడు కూడా చిదంబరంకు సుప్రీంకోర్టులో మళ్ళీ ఇదే పరిస్థితి ఎదురవవచ్చు.