
మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి (66) అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం ఆయన కిడ్నీ మార్పిది ఆపరేషన్ చేయించుకొని, అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఈనెల 9వ తేదీన శ్వాసతీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూసినట్లు ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది.
అరుణ్ జైట్లీ ఆర్ధిక, రక్షణ, కారోపోరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు, ప్రతిపక్ష నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీభక్షి, కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నారు.