గజ్వేల్ ఆదర్శంగా రాష్ట్రమంతటా పచ్చదనం: కేసీఆర్‌

గజ్వేల్ మండలంలో కోమటిబండ వద్ద మిషన్ భగీరధ ప్రాజెక్టును సందర్శించిన తరువాత సిఎం కేసీఆర్‌ మంత్రులను, జిల్లా కలెక్టర్లను అక్కడికి దగ్గర్లో పెంచిన అటవీప్రాంతానికి తీసుకువెళ్ళి చూపించారు. ఒకప్పుడు ఎడారిని తలపించే విధంగా ఉండే ఆ ప్రాంతమంతా కేవలం 5 ఏళ్ళ వ్యవధిలో ఏవిధంగా పచ్చదనం సంతరించుకుందో సిఎం కేసీఆర్‌ వారికి వివరించారు. 

అక్కడ మొక్కలు వేసి వాటికి సంరక్షణ చేస్తూ దట్టమైన అడవిలా ఎదిగేలా చేసిన అటవీశాఖ అధికారులు ఆర్.శోభ, ఆర్.ఎం. డోబ్రియల్ వారి సిబ్బందిని మంత్రులకు, కలెక్టర్లకు పరిచయం చేశారు. ఆ అడవులను ఏవిధంగా పెంచారో, దానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వారి చేతే వివరింపజేశారు. 

అంతకు ముందు ఆ ప్రాంతంలో చెట్లు లేకపోవడంతో కోతులు, కొండముచ్చులు, పాములు వంటి జంతువులు పరిసర ప్రాంతాలలో ఊళ్ళలోకి వచ్చేస్తుండేవి కానీ ఇప్పుడు పండ్ల చెట్లతో కూడిన దట్టమైన అడవులు పెరిగిన తరువాత మళ్ళీ కోతులు, పాములు, పక్షులు వంటి వన్యజీవులన్నీ వాటి సహజసిద్ద ఆవాస ప్రాంతమైన అడవులలోకి తిరిగి వస్తున్నాయని అధికారులు వివరించారు. 

అడవులను పెంచడమే కాకుండా వాటి చుట్టూ కందకాలు తవ్వి వాటిలో నీరు పారేలా చేయడంతో అడవిలోపల ఉన్న జంతువులు మళ్ళీ బయటకు పోకుండా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. అలాగే కందకాలపక్కనే ముళ్ళ కంపలుగా ఎదిగే గచ్చకాయల మొక్కలు వేయడం ద్వారా బయటివారెవరూ అడవిలోకి ప్రవేశించి జంతువులు, పక్షులను వేటాడకుండా నివారిస్తున్నామని తెలిపారు. అడవుల పెంపకంలో మెళుకువలను, తీసుకోవలసిన చర్యల గురించి అటవీశాఖ అధికారులు మంత్రులు, జిల్లా కలెక్టర్లకు చక్కగా వివరించారు. 

గజ్వేల్ అటవీప్రాంతం ఆదర్శంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అడవులను పెంచాలని సిఎం కేసీఆర్‌ వారిని కోరారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూములు ఉన్నప్పటికీ అందులో ఉండవలసినంత చెట్లు, పచ్చదనం లేవని కనుక ఈ వర్షాకాలంలో అందరూ యుద్ధప్రాతిపాదికన మొక్కలు నాటి అడవుల పెంపకం మొదలుపెట్టాలని సిఎం కేసీఆర్‌ వారిని కోరారు.