
మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి. చిదంబరంను సిబిఐ అధికారులు నాటకీయ పరిణామాల మద్య బుదవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ముద్దాయిగా పేర్కొనబడుతున్న ఆయనకు డిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ కూడా ముందస్తు బెయిల్పై పిటిషన్ తిరస్కరించడంతో సిబిఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన సుప్రీంకోర్టు కూడా బెయిల్పై తిరస్కరించడంతో బుదవారం రాత్రి డిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఎటువంటి నేరమూ చేయలేదని, సిబిఐ చెపుతున్నట్లు ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసుతో తనకు సంబందంలేదని చెప్పారు. తాను ఎక్కడికి పారిపోలేదని, మంగళవారం రాత్రి ఈ కేసు గురించి మాట్లాడేందుకు తన లాయర్ల వద్దకు వెళ్ళానని చెప్పారు.
ఆయన కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చినట్లు మీడియాలో వార్తలు చూసి, సిబిఐ అధికారులు అక్కడికి చేరుకునేసరికి ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. దాంతో వారు కూడా ఆయన నివాసానికి చేరుకొని లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో సిబిఐ అధికారులు లోపలకు వెళ్లవలసి వచ్చింది. లోపలకు వెళ్ళిన తరువాత కూడా చిదంబరం తలుపులు తీయకపోవడంతో సిబిఐ, ఈడీ అధికారులు ఆయన ఇంటిని చుట్టుముట్టి గోడదూకి లోపలకు ప్రవేశించి చిదంబరాన్ని అరెస్ట్ చేసి కారులో సిబిఐ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వారిని చెదరగొట్టారు.
చిదంబరం ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్ లతో పాటు మరో నాలుగు కంపెనీలకు విదేశాల నుంచి పెట్టుబడులు పొందేందుకు వీలుగా ఎఫ్ఐపిబి అనుమతులు మంజూరు చేశారు. అందుకు బదులుగా చిదంబరం, ఆయన కొడుకు కార్తీలకు చెందిన డొల్ల కంపెనీలలో రూ.300 కోట్లు అక్రమంగా డిపాజిట్ చేయబడినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులోనే చిదంబరాన్ని సిబిఐ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో సిబిఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దానిని ఖండించడం ఆవినీతిని సమర్ధిస్తున్నట్లుంది.