
బిజెపిలో అంతర్లీనంగా మతవాదం కనిపిస్తుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో భావప్రకటన స్వేచ్చ కాస్త ఎక్కువ. తెరాస అందుకు భిన్నం. ఆ పార్టీలో నోరెత్తి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. మంత్రివర్గ విస్తరణ చేయలేదు. అయినా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేరు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు “నా మౌనం కూడా సమాధానమే...ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే,” అని చెప్పినట్లుగా ఈ ఆలస్యానికి కూడా ఏవో బలమైన కారణాలే ఉంటాయని తెరాస నేతలు సరిపెట్టుకొంటున్నారేమో?
తెరాసను వీడి బిజెపిలో చేరిన జితేందర్ రెడ్డి, జి.వివేక్ వంటి నేతలు సిఎం కేసీఆర్, ఆయన విధానాలపై చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తెరాస తేలికగా కొట్టిపడేయవచ్చు లేదా ఎదురుదాడి చేసి తమ అధినేతను సమర్ధించుకోవచ్చు. కానీ పార్టీలో అసంతృప్తి నెలకొందనే విషయాన్ని వివేక్ వంటి వారి విమర్శలు బయటపెడుతున్నాయని తెరాస గ్రహించినట్లు లేదు. వారు పార్టీలో ఉన్నప్పుడు పదవులు, అధికారం కోసమే తమ అధిష్టానం వైఖరిపై తమ అభిప్రాయాలను మనసులో దాచుకొంటున్నారని, పార్టీ నుంచి బయటపడగానే వాటినే బయటకు వెళ్ళగ్రక్కుతున్నారని గ్రహిస్తే, పార్టీలో ఇంకా ఇటువంటి అసంతృప్త నేతలు ఇంకా ఎందరున్నారో...కేసీఆర్ వైఖరి గురించి ఎవరెవరు ఏమనుకుంటునారో? అనే సందేహం కలుగకమానదు.
ఇటీవల తెలంగాణ వికాస సమితి 3వ వార్షికోత్సవ సభలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “భిన్నాభిప్రాయాలపై చర్చించే వాతావరణం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంకు అర్ధం ఉంటుంది. మాతో ఉంటేనే దేశభక్తులు లేకుంటే దేశద్రోహులు అనే పద్దతిలో అవాంఛనీయ రాజకీయాలు సాగుతున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ బిజెపిని, మోడీ ప్రభుత్వ నిరంకుశవైఖరిని విమర్శిస్తునట్లుగా అర్ధమవుతోంది. కానీ ఆయన మోడీ ప్రభుత్వాన్ని ఒక వేలెత్తి చూపినప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు తమ ప్రభుత్వాన్నే చూపిస్తున్నాయనే సంగతి పరిణతి చెందిన రాజకీయనాయకుడైన కేటీఆర్కు తెలియకనే ఆవిధంగా మాట్లాడారనుకోలేము. అంటే ఆయన కూడా కేసీఆర్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారా? అందుకే పరోక్షంగా ఈవిధంగా మాట్లాడారా? అనే అనుమానం కలుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ తెరాసను వీడిన నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తెరాస తేలికగా తీసుకోకుండా, పార్టీలో అసంతృప్తి ఉందా?ఉంటే దానిని ఏవిధంగా తగ్గించుకోవాలని ఇప్పటి నుంచే ఆలోచించుకుంటే మంచిదేమో?
అలాకాక “ఆల్ ఈజ్ వెల్...పార్టీలో అందరూ క్రమశిక్షణతో మెలుగుతున్న సైనికులే...ప్రజలందరూ మనవైపే ఉన్నారు” అనుకుంటూ ముందుకు సాగితే ఏమవుతుందో లోక్సభ ఫలితాలు నిరూపించి చూపాయి.