
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్ గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దశాబ్ధాలుగా తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని గత 5 ఏళ్ళలోనే సరిచేసుకొని సమస్యలను, సవాళ్లను అధిగమించుకొంటూ ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నాము. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పచ్చదనం, పరిశుభ్రత కూడా పెరిగినప్పుడే ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించగలుగుతారు. దీనికోసం ప్రత్యేకంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాము.
దీనిలో భాగంగా రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతీ ఇంటిలో కనీసం 6 మొక్కలు నాటుకొని రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు కృషి చేయాలి. అటవీశాఖ, మున్సిపల్ అధికారులు ప్రతీ ఇంటికీ తప్పనిసరిగా 6 మొక్కలను పంపిణీ చేస్తారు. అలాగే ప్రతీ ఊరిలో పాడైన విద్యుత్ స్తంభాలను, వైర్లను మార్చేందుకు అవసరమైన నిధులు, సామాగ్రి సిద్దం చేస్తున్నాము. కనుక ప్రజలందరూ తమ తమ ప్రాంతాలలో పాడైన విద్యుత్ స్తంభాలను, వైర్లను మార్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవస్థలన్నిటినీ బలోపేతం చేసి అవినీతిరహితమైన పరిపాలన అందించేందుకు చేసేందుకు చట్టాలలో అవసరమైన మార్పులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలు ఆశించిన సత్ఫలితాలు ఇస్తున్నాయి కనుకనే ఇప్పుడు యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో హాయిగా జీవించాలన్నదే మా ప్రభుత్వ ఆశయం. అందుకోసం ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా సాగిపోతూనే ఉంటాయి,” అని అన్నారు.