నల్గొండ, కొత్తగూడెంలో టిడిపి ఖాళీ

నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో టిడిపి ఖాళీ అయిపోతోంది. రెండు జిల్లాలకు చెందిన పలువురు టిడిపి నేతలు బుదవారం పార్టీకి రాజీనామాలు చేసి ఈనెల 18న బిజెపిలో చేరబోతునట్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిడిపి అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టిడిపి భవిష్యత్ లేనందున తన రాజకీయ భవిష్యత్ కోసమే బిజెపిలో చేరుతున్నానని చెప్పారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో పాల్వాయి రజనీకుమారి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, కదారి అంజయ్య, సాధినేని శ్రీనివాస్ రావు తదితరులు బుదవారం పార్టీకి రాజీనామాలు చేశారు. ఈనెల 18న హైదరాబాద్‌ నాంపల్లిలో జరుగబోయే బిజెపి బహిరంగసభలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా సమక్షంలో తామందరం బిజెపిలో చేరబోతున్నట్లు వారు తెలిపారు. 

ఏపీలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో టిడిపి పతనం ప్రారంభం అయ్యింది కానీ చంద్రబాబునాయుడు దానిని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలో కూడా టిడిపి ఓడిపోవడంతో రెండు రాష్ట్రాలలో టిడిపి బలహీనపడుతోంది. ఇదివరకు తెరాస టిడిపి నేతలను ఫిరాయింపజేసుకొని బలహీనపరిస్తే, ఇప్పుడు బిజెపి టిడిపిని తుడిచిపెట్టేస్తోంది. కనుక వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో టిడిపి పూర్తిగా అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు.