ప్రధాని మోడీకి రాజకీయ పరిణతి లేదు: అసదుద్దీన్

మజ్లీస్ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అవకాశం వస్తే ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తుంటారు. కశ్మీర్‌పై మోడీ ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ట్విట్టర్‌ ద్వారా మళ్ళీ విమర్శలు గుప్పించారు. 

“ఆనాడు పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కశ్మీర్‌పై నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీకి వారంత రాజకీయ పరిజ్ఞానం లేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయానికి అనుగుణంగా కశ్మీర్‌పై నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొంటున్న నరేంద్రమోడీకి ఆర్టికల్ 370ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా అంగీకరించిన సంగతి తెలియదు,” అని విమర్శించారు. 

మోడీ ప్రభుత్వం కశ్మీర్‌ను ప్రేమిస్తుంది కానీ అక్కడి ప్రజలను కాదు. కశ్మీర్‌లోని భూమిని మాత్రమే ప్రేమించే బిజెపి నాయకులు మళ్ళీ అక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని కశ్మీర్‌ ప్రజలు వారి ప్రయత్నాలను తిప్పి కొడతారని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.