
నరేంద్రమోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అభివృద్ధికి తొలి అడుగు వేసేందుకు సిద్దం అవుతోంది. అక్టోబర్ 12 నుంచి మూడు రోజులపాటు శ్రీనగర్‌లో ప్రపంచపెట్టుబడిదారుల సదస్సు నిర్వహించి జమ్ముకశ్మీర్‌కు పెట్టుబడులు సాధించాలని నిర్ణయించింది. జమ్ముకశ్మీర్‌లో మౌలికవసతులు, ప్రభుత్వం అందించబోయే రాయితీలు, సౌకర్యాల గురించి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించి, జమ్ముకశ్మీర్‌పై వారిలో నెలకొనున్న అపోహలు, భయాలు తొలగించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని జమ్ముకశ్మీర్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ చౌదరి తెలిపారు. త్వరలోనే దేశంలో అన్ని ప్రధాన నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, లండన్, నెదర్లాండ్స్ తదితర దేశాలలో ఈ సదస్సు గురించి రోడ్ షోలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. దేశవిదేశాలకు చెందిన 2,000 మంది పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించబోతున్నట్లు నవీన్ చౌదరి తెలిపారు.
కశ్మీర్ విభజన, స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయాలపై కశ్మీర్ ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోకుండానే, కశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తతలు చల్లబడక మునుపే కేంద్రప్రభుత్వం శ్రీనగర్‌లో ప్రపంచపెట్టుబడిదారుల సదస్సు నిర్వహించాలనుకోవడం చూస్తే “తొందరపడి ఓ కోయిల ముందే కూసింది...” అనే పాట గుర్తురాక మానదు.
కశ్మీర్ ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు భారత ప్రభుత్వంతో కంటే వేర్పాటువాదులు, ఉగ్రవాదులవైపే మొగ్గు చూపుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఏదోవిధంగా వారిని ఎగద్రోసి భారత ప్రభుత్వంపై ఉసిగొల్పడానికి పాకిస్తాన్ చేయగలిగినంతా చేస్తోంది. కనుక జమ్ముకశ్మీర్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని అర్ధమవుతోంది. కనుక ముందుగా జమ్ముకశ్మీర్‌లో శాంతియుతవాతావరణం ఏర్పడేందుకు...కశ్మీర్ ప్రజల నమ్మకం పొందేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టి ఆ తరువాత ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇన్ని దశాబ్ధాలు ఆగినప్పుడు మరికొన్ని నెలలు ఆగితే జమ్ముకశ్మీర్‌కు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కదా?