
మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో శుక్రవారం సాయంత్రం డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన గత కొంతకాలంగా గుండె, మూత్రపిండాల (కిడ్నీ) సంబందిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ్ళ సాయంత్రం ఆయన శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎయిమ్స్ లో చేర్చారు. ఆయన గత ఏడాదే రెండు మూత్రపిండాలు మార్పిడి చేయించుకున్నారు. కానీ అప్పటి నుంచి నిత్యం ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. ఆయనను ఎయిమ్స్ చేర్చిన సంగతి తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం జైట్లీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్సలు అందిస్తోంది.