మహబూబ్నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో హరితహారం, ఇంకుడుగుంతల తవ్వకాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. దాని గురించి అందరికీ చాలా ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ కొందరు ఆలస్యంగా రాగా మరికొందరు సమావేశానికి హాజరుకాలేదు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఏకంగా 93 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, ఇంకుడుగుంతల తవ్వకాల పనులు జిల్లాలో సంతృప్తికరంగా జరగడంలేదని భావిస్తున్న ఆయన జిల్లాలోని ఎంపీడీవోలు, ఏపీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు సరిగ్గా జరగడం లేదని ఆసంతృప్తిగా ఉన్న కలెక్టర్ వాటి గురించి సమీక్షా సమావేశం నిర్వహిస్తే దానికి కూడా సిబ్బంది హాజరుకాకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో వివిద మండలాలోని 93 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అడ్డాకుల, మూసాపేట-14, కోయిల కొండ-8, జడ్చర్ల-4, మహబూబ్నగర్-1, బాలానగర్-9, దేవరకద్ర-7, సిసి కుంట-1, మిడ్జిల్-3, నవాబుపేట-11 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ పై సస్పెన్షన్ వేటువేశారు.
ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన 24 మంది గ్రామ కార్యదర్శులపై కూడా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో మూసాపేట మండలంలో-7, అడ్డాకుల-4, నవాబుపేట-5, బాలానగర్-5, జడ్చర్ల-3 గ్రామ పంచాయతీ కార్యదర్శులున్నారు.
జిల్లాలో హరితహారం, ఇంకుడుగుంతల తవ్వకం పనులలో ఇకపై ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించబోనని సమావేశానికి హాజరైనవారిని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం అందరూ విధిగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ తీరుపై కార్యదర్శులు, సిబ్బంది గుర్రుగా ఉన్నప్పటికీ జిల్లా ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నెలనెలా టంచనుగా జీతాలు తీసుకొంటూ సక్రమంగా విధులు నిర్వర్తించనివారి పట్ల కటినంగా వ్యవహరించడం అవసరమేనని అభిప్రాయపడుతున్నారు.