
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు భారతరత్న అవార్డును అందజేశారు. ప్రణబ్ ముఖర్జీ గత నాలుగు దశాబ్దాలుగా దేశానికి వివిదహోదాలలో సేవలందించినందుకు ఈ అత్యున్నతమైన పౌర పురస్కారం అందుకున్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ శత్రువుగా భావించే బిజెపి (ప్రభుత్వం) ఆయన సేవలను గుర్తించి ఈ అత్యున్నతమైన పురస్కారం అందజేయడం విశేషం.
సీనియర్ ఆర్‌ఎస్ఎస్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారియాలకు కూడా మరణాంతరం నేడు భారతరత్న అవార్డును ప్రకటించారు. భూపేన్ హజారియా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారియా, నానాజీ దేశ్‌ముఖ్ తరపున నానాజీ దీన్ దయాళ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి, కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపారు.