
జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా పాకిస్థాన్ ప్రభుత్వం వరుసగా అనేక ప్రతీకార చర్యలు తీసుకొంటోంది. భారత్ విమానాలకు నిన్నటి నుంచి మళ్ళీ పాక్షికంగా తమ గగనతలాన్ని నిషేదించిన పాకిస్థాన్, గురువారం భారత్-పాక్ మద్య నడుస్తున్న సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసింది. పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఈరోజు ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేటి నుంచి సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నాము. ఆ రైలు బోగీలను ఈద్ పండుగకోసం సొంత ఊళ్ళకు వెళుతున్న ప్రయాణికుల కోసం వినియోగిస్తాము,” అని చెప్పారు.
భారత్-పాక్ దేశాల మద్య వారానికి ఒక్క రోజు నడుస్తున్న సంజౌతా ఎక్స్‌ప్రెస్ బుదవారం రాత్రి 9.30 గంటలకు లాహోర్ నుంచి 60 మంది ప్రయాణికులతో బయలుదేరి పాక్ సరిహద్దు రైల్వే స్టేషన్ వాఘాకు చేరుకొంది. అక్కడకు చేరుకున్న తరువాత పాక్ ప్రభుత్వం దానిని నిలిపివేయాలని నిర్ణయించడంతో వారందరూ వాఘా రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయారు. ప్రస్తుత పరిస్థితులలో పాకిస్థాన్ రైల్వే డ్రైవరు, గార్డును భారత్‌వైపు పంపించలేమని కనుక కావాలనుకుంటే భారత్ తన రైల్వే డ్రైవరు, గార్డును పంపించి సంజౌతాలోని భారత్‌కు చెందిన బోగీలను తీసుకుపోవచ్చునని సమాచారం వచ్చినట్లు భారత్ సరిహద్దు రైల్వే స్టేషన్ ఆటారీ సూపరింటెంట్ అరవింద్ కుమార్ గుప్తా తెలిపారు. భారత్ ప్రభుత్వం అనుమతిస్తే భారతీయ రైల్వే డ్రైవరు, గార్డును వాఘాకు పంపించి ఆ రైలును తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.