జమ్ముకశ్మీర్‌పై భారత్ తీసుకున్న తాజా చర్యలపై పాకిస్థాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన జాతీయభద్రతాకమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొంది. భారత్‌తో ఇకపై నామమాత్రపు దౌత్యసంబంధాలు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. వాటిలో భాగంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషనర్ అజయ్ బిసారిని తొలగిస్తున్నట్లు ప్రకటించి తక్షణం దేశం విడిచి వెళ్ళిపోవలసిందిగా ఆదేశించింది. అలాగే త్వరలో డిల్లీలోని బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న పాక్ రాయబారి మెయిన్ ఉల్ హక్‌ను డిల్లీకి పంపించరాదని నిర్ణయించింది.
ఇరుదేశాల మద్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను, ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలన్నిటినీ పునఃసమీక్షించాలని నిర్ణయించింది. పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని కశ్మీర్‌లోని ప్రజలకు సంఘీభావదినంగా, అదేవిధంగా భారత్ స్వాతంత్ర దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’ పాటించాలని నిర్ణయించింది. కశ్మీర్‌పై జరిగిన ఒప్పందాలను భారత్ అతిక్రమించి ఏకపక్షంగా తీసుకున్న చర్యల గురించి ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
అయితే వీటిలో ఒక్క వాణిజ్య ఒప్పందాలను పునః సమీక్షించాలనే ఒక్క నిర్ణయం వలన మాత్రమే భారత్‌కు కొంత ఇబ్బంది కలుగుతుంది తప్ప మిగిలినవి భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు కానీ భారత్‌ను ఏమీ చేయలేక ద్వేషంతో రగిలిపోతున్న పాక్ చేతులు ముడుచుకొని కూర్చోంటుందనుకోలేము. భారత్ తీసుకున్న నిర్ణయాల వలన కశ్మీర్లో మళ్ళీ పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారమే హెచ్చరించారు. కనుక ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి భారత్ సంసిద్దంగా ఉండకతప్పదు.