బిజెపి సంతోషాన్ని హరించిన ఆమె మరణం

నరేంద్రమోడీ ప్రభుత్వం, బిజెపి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌, కశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370 బిల్లులకు అవలీలగా పార్లమెంటులో ఆమోదముద్ర వేయించుకోగలిగింది. 70 సంవత్సరాలుగా ఎవరూ ముట్టుకోవడానికి సాహసించని ఈ మూడు సమస్యలను నరేంద్రమోడీ ప్రభుత్వం ముట్టుకోవడమే కాకుండా కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఆ బిల్లులను పార్లమెంటు చేత ఆమోదింపజేసుకొని వాటికి చట్టరూపం కల్పించడంతో కేంద్రప్రభుత్వంలోని మంత్రులు, బిజెపి అధిష్టానం, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీనేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకొంటున్నారు. 

కానీ మంగళవారం రాత్రి వారికి అత్యంత ప్రియతమ నేత సుష్మా స్వరాజ్ ఆకస్మికంగా మరణించడంతో వారందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. తమ ప్రియతమ నేతకు కన్నీటి నివాళులు ఆర్పిస్తున్నారు. ఆమెతో చాలా అనుబందం ఉన్న బిజెపి వ్యవస్థాపకుడు లాల్ కృష్ణ అద్వానీ, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి అనేకమంది హేమాహేమీలు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చి కన్నీరు చిందించారు.

పార్లమెంటులో కశ్మీర్ బిల్లులను ఆమోదింపజేసుకొన్నందుకు ప్రధాని నరేంద్రమోడీని ట్విట్టర్‌లో అభినందించిన సుష్మా స్వరాజ్ ‘ఈరోజు కోసమే నేను ఇంతకాలం ఎదురుచూస్తున్నాను,” అని ట్వీట్ చేసి అదే తన ఆఖరి కోరిక అన్నట్లు వెంటనే తనువు చాలించడం చూసి ప్రధాని నరేంద్రమోడీతో సహా అందరూ చలించిపోయారు. బుదవారం మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీలోని బిజెపి కార్యాలయం నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. లోఢీ రోడ్డులో ఆమెకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆమె అంత్యక్రియలకు హాజరుకానున్నారు.