11.jpg)
మాజీ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పార్టీలకు, ప్రాంతాలకు, బాషలకు, మతాలకు చివరికి దేశాల సరిహద్దులకు అతీతంగా అందరితో చాలా స్నేహభావంగా మెలిగేవారనే సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రాత్రి ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలియగానే మొట్టమొదట అక్కడకు వెళ్ళినవారిలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఒకరు. ఆమె విదేశాంగమంత్రిగా ఉన్నపుడు ఎందరో పాకిస్తానీలను ఆదుకొన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయినందుకు దేశంలో అన్ని పార్టీల నేతలు ఆమెతో తమ అనుబందాన్ని తలుచుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన ట్విట్టర్ పేజీలో సంతాపం తెలుపుతూ గతంలో ఆమెతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దానిపై షోయబ్ అనే ఒక పాకిస్థానీ “ఆమెకు కశ్మీరీల ఉసురు తగిలింది. నరకం ఆమె కోసం ఎదురుచూస్తోంది,” అంటూ వ్యంగ్యంగా మెసేజ్ పెట్టాడు. దానిపై వెంటనే స్పందించిన కేటీఆర్, “చనిపోయిన ఒక వ్యక్తిని ఉద్దేశ్యించి పెట్టిన మెసేజ్ నీ వక్రబుద్దికి అద్దం పడుతోంది. షోయబ్, నీ ప్రొఫైల్‌ను బట్టి నువ్వు పాకిస్థాన్‌కు చెందినవాడివని అర్ధం అవుతోంది. ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప వ్యక్తి పట్ల ఏవిధంగా మాట్లాడాలో తెలుసుకొంటే మంచిది,” అని జవాబిచ్చారు.