
బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ (67) మంగళవారం రాత్రి సుమారు 10 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న సాయంత్రం లోక్‌సభలో కశ్మీర్‌కు సంబందించిన బిల్లు ఆమోదం పొందగానే ఆమె ప్రధాని నరేంద్రమోడీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనికోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానని, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. అదే ఆమె ఆఖరి సందేశం. ఆ తరువాత రాత్రి 9.30 గంటలకు ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండగానే ఆమె కన్నుమూశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ తదితరులు ఆమె మృతి చెందినట్లు తెలియగానే దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.