2.jpg)
సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకకు వెళ్ళగలరు. అక్కడ ఒక్కో కుటుంబానికి ఉదారంగా రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తారు కానీ నెలలు గడుస్తున్నా హాజీపూర్ బాధితకుటుంబాలను పరామర్శించడానికి ఆయన వద్ద సమయం ఉండదు. వారిని ఆదుకోవాలనే ఆలోచనా కలుగదు. సిఎం కేసీఆర్‌కు ఇటువంటి సమస్యలపై ఆసక్తి ఉండదు కనుకనే ఇంతవరకు హాజీపూర్ హత్యాచారలపై కనీసం స్పందించలేదు. హాజీపూర్ బాధితులు ఏం పాపం చేశారని సిఎం కేసీఆర్ వారిని పట్టించుకోవడం లేదు? నెలలు గడుస్తున్నా కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు? అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుడు శ్రీనివాస్ రెడ్డికి ఇంతవరకు ఎందుకు శిక్ష పడలేదు? తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే సిఎం కేసీఆర్ ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమించవలసి వస్తుంది. చింతమడక గ్రామస్తులకు మంజూరు చేసినట్లే రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధికసాయం చేయాలని సిఎం కేసీఆర్‌ను కోరుతున్నాను,” అని అన్నారు.