గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా!

తెలంగాణ రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఆయనను తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సిఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆయన ప్రగతి భవన్‌ వెళ్ళి సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన తరువాత తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చి చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్‌ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు సమన్వయ సమితికి ఆయనను ఛైర్మన్‌గా నియమించారు.   

గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరేటప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ నల్గొండ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ వారించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. లోక్‌సభ ఎన్నికలలో గుత్తాను నల్గొండ నుంచి పోటీ చేయిస్తారనుకొన్నప్పటికీ సిఎం కేసీఆర్‌ వేమిరెడ్డి నర్సింహ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. నల్గొండ నియోజకవర్గంపై మంచి పట్టున్న గుత్తాకు అవకాశం కల్పించి ఉండి ఉంటే ఆయన అవలీలగా గెలిచి ఉండేవారేమో? మళ్ళీ ఎంపీ కాగల సత్తా ఉన్న గుత్తా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవలసివస్తోంది.