
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఇంకా రాజకీయ ప్రకంపనలు కలుగుతూనే ఉన్నాయి. కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. దేవుడి దయ వలన రెండుసార్లు అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం చేయగలిగినంతా చేశాననే సంతృప్తి కలిగినప్పటికీ, తన ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు జరిగిన రాజకీయాలను, సంకీర్ణ ప్రభుత్వంలో కులరాజకీయాలు, ఆదిపత్యపోరు వంటివి చూసిన తరువాత రాజకీయలంటే విరక్తి కలిగిందని అన్నారు. కనుక రాజకీయాలకు దూరంగా శేషజీవితం ప్రశాంతంగా జీవించాలనుకొంటున్నానని అన్నారు.
కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నప్పుడే కాంగ్రెస్ నేతల తీరుతో కుమారస్వామికి కంటినిండా కునుకు లేకుండాపోయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా సాగుతున్న ఆయన ప్రభుత్వాన్ని యడియూరప్ప కూల్చివేశాడు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కుమారస్వామి చివరి నిమిషం వరకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ దానిని కాపాడుకోలేక పదవీ, అధికారం కోల్పోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు.