
నల్లమల అడవులలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం సర్వే నిర్వహించబోతోందనే వార్తలపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, గిరిజన సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. యురేనియం తవ్వకాలు జరిపితే అక్కడ నివసిస్తున్న గిరిజనులు, వేలాది వన్యప్రాణులు, పచ్చదనం, చివరికి గాలీ, నీరు, భూమి అంతా సర్వనాశనం అవుతాయని కనుక అటువంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ కేంద్రప్రభుత్వం మొండిగా ముందుకు సాగితే అడ్డుకొంటామని ప్రతిపక్షాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన అభిప్రాయం తెలియజేయవలసి ఉంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం అప్పుడే ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పోరాటాలు ప్రారంభించాయి. తెలంగాణ జనసమితి కూడా వాటిలో ఒకటి.
ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శనివారం అచ్చంపేట మండలం నల్లమల ప్రాంతంలో గిరిజనులతో మాట్లాడేందుకు వెళుతుండగా పోలీసులు ఆయన హాజీపూర్ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “అటవీసంపదను విధ్వంసం చేస్తే ఎటువంటి నష్టాలు కలుగుతాయో స్థానిక ప్రజలకు తెలియజేసేందుకు వెళుతున్న నన్ను పోలీసులతో అడ్డగించి అరెస్ట్ చేయించడం చాలా దారుణం. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలతో మాట్లాడేందుకు కూడా వీలులేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం. ఈ అరెస్టులు, నిర్బందాలు చూస్తుంటే ఇది నిర్బంద తెలంగాణ అనిపిస్తోంది. ఒక సమస్య గురించి స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు కూడా వీలులేదంటే ఎలా? మేము చర్చించాలనుకున్న సమస్య కంటే ఈ నిరంకుశత్వమే మాకు ఎక్కువ బాధ కలిగిస్తోంది,” అని అన్నారు.