
మాజీ ఎంపీ, తెలంగాణ రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేశారు. తెరాస ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఛైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఖాళీ అయిన ఆ స్థానాన్ని సిఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కేటాయించారు. ఎమ్మెల్యేల కోటాలో ఉన్న ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితిలో లేదు కనుక గుత్తా సుఖేందర్ రెడ్డి గెలుపు లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. ఆగస్ట్ 7న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ వేరే ఎవరూ నామినేషన్ వేసే అవకాశం లేదు కనుక అదే రోజున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది. గుత్తాకు అవకాశం ఇవ్వడంతో నల్గొండ జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం కల్పించినట్లయింది. మరో ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ మండలి డెప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.