
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్-2 చాలా సజావుగా సాగిపోతోంది. ఇప్పటివరకు మూడుసార్లు దానిని తదుపరి స్థాయికి తీసుకువెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు మళ్ళీ నిన్న (శుక్రవారం) మరోసారి దానికి అమర్చిన బూస్టర్ ఇంజన్లను సుమారు 10 నిమిషాలు ఫైర్ చేయడం ద్వారా మరింత ఎత్తుకు చంద్రుడి కక్ష్యవైపు తీసుకువెళ్లారు. నాలుగవ దశ ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మళ్ళీ ఈనెల 6న ఇదేవిధంగా దాని ఎత్తును పెంచుతామని తెలిపారు. దాంతో ఈనెల 14న చంద్రయాన్-2 భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఆగస్ట్ 20వ తేదీకి పూర్తిగా చంద్రుడి స్థిర కక్ష్యలోకి ప్రవేశించి చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా దగ్గర అవుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సుమారు 8గంటలకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ అనే ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ అది అని ఇస్రో శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇంతవరకు అన్ని దిగ్విజయవంతంగా నెరవేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ చివరి దశను కూడా విజయవంతంగానే నిర్వహించగలరని ఆశించవచ్చు.