1.jpg)
ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు దాని మాటే శాసనంగా సాగుతుంది కానీ ఓడిపోతే అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహించి తప్పుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ పార్టీ బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా తప్పుకోవడమే తప్పు. పోతూ పోతూ...తన కుటుంబంలో వారెవరూ అధ్యక్ష పదవి చేపట్టరాదని షరతులు విధించడం ఇంకా తప్పు. రాహుల్ నిర్ణయాల కారణంగా 135 సం.లు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వంలేని పార్టీగా దయనీయంగా మారింది. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ కనబడని అయోమయ పరిస్థితులు ఇప్పుడు పార్టీలో నెలకొన్నాయి.
రాహుల్ గాంధీ భరించలేని ఆ ముళ్ళ కిరీటాన్ని ఎవరు మాత్రం ధరించి భరించగలరు?ఒకవేళ ధరించి భరించడానికి సిద్దపడినా సోనియా, రాహుల్, ప్రియాంకాల మాటను కాదని పార్టీని తమకు నచ్చినట్లు నడిపించగలరా?నడిపించినా పార్టీకి మళ్ళీ పూర్వవైభవం సాధించగలరా? నెహ్రూ కుటుంబానికి మాత్రమే గౌరవమిచ్చే కాంగ్రెస్ నేతలు ఇతరులెవరైనా పార్టీ పగ్గాలు చేపడితే అతను లేదా ఆమె మాటలను, ఆదేశాలను గౌరవిస్తారా? అనే ప్రశ్నలు పార్టీలో ఎవరినీ ముందుకు రాకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కనుక కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆ భాద్యతలను కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనుక అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనగుతూనే ఉంటుంది.