హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్?

హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలం నుంచే ఉంది. తెరాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేంద్రన్యాయశాఖామంత్రి రవిశంకర్‌ను కలిసి మళ్ళీ మరోసారి దాని గురించి గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలవారు...ముఖ్యంగా సామాన్య పౌరులు డిల్లీకి వచ్చి సుప్రీంకోర్టులో కేసులు వేయడం, ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని కనుక హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఏటా సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల జాబితా పెరుగుతూనే ఉందని కనుక దీనికి ఏకైక పరిష్కారం హైదరాబాద్‌లో బెంచ్ ఏర్పాటు చేయడమేనని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయదలిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్దంగా ఉందని వినోద్ తెలిపారు. 

పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఆలోచనలు చేయడం చాలా అవసరం. కానీ పాతకాలం ఆలోచనలు, విధానాలకు అలవాటుపడిన పాలకులు, బ్యూరోక్రాట్లు, ఇటువంటి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలను ఇష్టపడరు. కనుక ఇటువంటి ప్రతిపాదనలలో సాధ్యాసాధ్యాలు, లాభనష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండానే సాంకేతిక, న్యాయ, రాజ్యాంగ, పాలనాపరమైన ఇబ్బందులున్నాయనే కుంటిసాకులతో పక్కన పడేస్తుంటారు. కానీ ఏనాటికైనా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించాలనే పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. మరి దాని ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.