
డిస్కవరీ ఛానల్లో ప్రసారమవుతున్న అత్యంత ప్రజాధారణ పొందిన ‘మ్యాన్ వెర్సస్ వైల్డ్’ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ చేసే సాహసయాత్రలను చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరించకమానదు. సామాన్య మానవులు ఎవరూ అటువంటి సాహసాలు చేయలేరు కానీ విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన ప్రధాని నరేంద్రమోడీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిస్కవరీ ఛానల్ అభ్యర్ధన మేరకు ప్రధాని నరేంద్రమోడీ, బేర్ గ్రిల్స్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో దానిని చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ బేర్ గ్రిల్స్‌తో కలిసి కొండలు, గుట్టలు, అడవులలో తిరిగారు. నదిలో ప్రయాణించారు. వాతావరణ మార్పులు, పర్యవసానాలు, పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాల గురించి వివరించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 12వ తేదీన డిస్కవరీ ఛానల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ, “గతంలో చాలా ఏళ్ళపాటు అడవులలో, కొండలలో ప్రకృతి ఒడిలో జీవించాను. కనుక మళ్ళీ అటువంటి అరుదైన అవకాశం లభించడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించాను. ఈ కార్యక్రమంలో నేను ప్రతీక్షణం ప్రకృతిని చాలా ఆస్వాదించాను. బేర్ గ్రిల్స్ నుంచి ప్రకృతికి సంబందించి అనేక కొత్తవిషయాలు నేర్చుకొన్నాను. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.
బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ, “భారత్ వంటి అతిపెద్ద దేశాన్ని నడిపిస్తున్న అంత గొప్ప వ్యక్తిని ఇంత దగ్గర నుంచి చూడటం, ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను,” అని అన్నారు.