.jpg)
ఒకపక్క గలగలపారుతున్న జలప్రవాహం...మరోపక్క వేలాదిగా తరలివస్తున్న జనప్రవాహం...ఇదేదో బొగత జలపాతం ముచ్చటనుకునేరు...కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఆదివారం కనబడిన జనజల ప్రవాహం. కాళేశ్వరం ప్రాజెక్టుకు బారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండలా మారిన మేడిగడ్డ బ్యారేజిని, దిగువన కన్నెపల్లి, అన్నారం బ్యారేజీలను అక్కడ పంప్‌హౌస్‌లలో నీటిని ఎత్తిపోస్తున్న భారీ మోటర్లను చూసేందుకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు కార్లు, బస్సులలో తరలివచ్చారు.
ఆదివారం కావడంతో నిన్న ఒక్కరోజే సుమారు 10,000 మంది పర్యాటకులు తరలివచ్చారు. దాంతో కాళేశ్వరం చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కన్నెపల్లి వరకు మట్టిరోడ్డు ఉన్నప్పటికీ అంతకు ముందు వాన కురవడంతో ఆ బురదమట్టిలో వాహనాలు చిక్కుకుపోయాయి. దాంతో పర్యాటకులు తమ వాహనాలను అక్కడే విడిచిపెట్టి సుమారు 3 కిమీ దూరం ఆ బురద రోడ్డుపైనే నడుచుకొంటూ వెళ్ళి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. పర్యాటకుల రాకతో అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొంది.
అక్కడకు వచ్చిన పర్యాటకులు పనిలోపనిగా గోదావరిలో స్నానాలు చేసి కాళేశ్వరంలోని వెలిసిన ముక్తీశ్వరస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో సందడిగా మారింది.
రానున్న రోజులలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 110 కిలోమీటర్ల పొడవున అన్ని బ్యారేజీల వద్ద నీటిని ఎత్తిపోయడం మొదలైతే దానిని చూసేందుకు మరింత మంది పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉంది కనుక జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేస్తే దూరప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది.