
మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల కరీంనగర్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినందుకు రాష్ట్ర బిజెపి నేతలు ఆయనపై పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేశారు. కరీంనగర్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కమలహసన్ రెడ్డి వాటిపై స్పందిస్తూ, అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగం ఎవరినీ రెచ్చగొట్టేవిధంగా లేదని అన్నారు. మళ్ళీ సీపి వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు స్పందిస్తూ, “ఒక రాజకీయ నాయకుడు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోవలసిన పోలీస్ శాఖ అతనికి వత్తాసుపలుకుతూ క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? సదరునేత మాట్లాడిన మాటలు రాజ్యాంగబద్దమైనవో కావో తెల్చేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా? ఓవైసీ సోదరులకు సిఎం కేసీఆర్ పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నారు కనుకనే పోలీసులు కూడా వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఓవైసీ సోదరులు ప్రజలను రెచ్చగొట్టడం మానుకోకుంటే వారికి తగినవిధంగా బుద్ది చెప్పాల్సివస్తుంది,” అని హెచ్చరించారు.
ముస్లిం ఓట్ల కోసమే సిఎం కేసీఆర్ ఓవైసీ సోదరులను వెనకేసుకువస్తున్నారని బిజెపి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెరాస ఆ విమర్శలను ఏనాడూ పట్టించుకోలేదు కనుక తిరిగి జవాబు ఇవ్వలేదు. ఇక సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిని కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా నియమించినప్పుడే హైదరాబాద్, మజ్లీస్ పార్టీలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. కానీ అటువంటి వాటికి మజ్లీస్ పార్టీ భయపడబోదని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కనుక మజ్లీస్-బిజెపిల మద్య మొదలైన ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.