వివేక్ కాంగ్రెస్‌ గూటికి చేరుతారా?

మాజీ ఎంపీ వివేక్ తెరాసను వీడిన తరువాత తెరాస సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టినా సంగతి తెలిసిందే. ఆయన తన శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పి బిజెపిలో చేరేందుకే ఈ హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆయన డిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడంతో ఆ వాదనకు బలం చేకూరింది. కనుక వచ్చే నెల అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో వివేక్ బిజెపిలో చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ సమయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం రాత్రి వివేక్ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగిరావలసిందిగా ఆహ్వానించడం విశేషం.ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు జి వివేక్ ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య తెలంగాణ వేదిక అధ్వర్యంలో సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా జి వివేక్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో రప్పించాలనే ఆలోచన మొదలైంది. అయితే కాంగ్రెస్ ఆహ్వానంపై వివేక్ ఏవిధంగా స్పందించారో ఇంకా తెలియవలసి ఉంది. 

బిజెపిలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని కానీ పదవులు, షరతులతో వచ్చేవారిని చేర్చుకోలేమని ఒక ప్రముఖ బిజెపి నేత అన్నారు. కనుక ఎటువంటి పదవులు ఆశించకుండా బిజెపిలో చేరేందుకు వివేక్ సిద్దపడతారా? లేక పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అనేది త్వరలోనే తేలిపోవచ్చు.