యడ్యూరప్ప కాదు...యడియూరప్ప నేడు ప్రమాణస్వీకారం

కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప జ్యోతిష్యుడి సలహా మేరకు తన పేరును మళ్ళీ బిఎస్ యడియూరప్పగా మార్చుకున్నారు. 2008లో ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పుడు యడియూరప్పగా ఉన్న తన పేరును జ్యోతిష్యుడి సలహా మేరకు తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. కానీ పేరు మార్చుకున్న తరువాత ముఖ్యమంత్రి పదవి కోల్పోవడమే కాక జైలులో గడపవలసి వచ్చింది. కనుక మళ్ళీ అటువంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో తన పేరును మళ్ళీ యడియూరప్పగా మార్చుకున్నారు. 

యడ్యూరప్ప సారీ...యడియూరప్ప ఈరోజు మధ్యాహ్నం కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఆయన అందుకు సమ్మతించడంతో యడియూరప్ప శుక్రవారం సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించగా కాంగ్రెస్‌ పార్టీ చాలా భిన్నంగా స్పందించింది.  

“అవినీతికి నిలువెత్తు నిదర్శనం, మాజీ జైలుపక్షి శ్రీ యడియూరప్ప ఎమ్మెల్యేలను కొనుగోలుచేయడంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి అధికారం చేజిక్కించుకోగలిగారు. 2008-2011లో ఆయన పరిపాలన ఎంత ఘోరంగా సాగిందో...చివరికి జైలుకు చేరుకోవడంతో ఏవిధంగా ముగిసిందో కర్ణాటక ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. ఈసారి కూడా చరిత్ర పునరావృతం కాబోతోంది,” అని కర్ణాటక కాంగ్రెస్‌ ట్వీట్ చేసింది.