బాబు కంటే కేసీఆరే మంచోడు: వైసీపీ

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి అప్పుడే ఐదున్నరేళ్ళు గడిచిపోయినా నేటికీ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్ర ప్రభావం ఉంటూనే ఉంది. ముఖ్యంగా కేసీఆర్‌, చంద్రబాబునాయుడుల మద్య ఉన్న రాజకీయ శతృత్వం, పంతాల ప్రభావం రెండు  ప్రభుత్వాలపై ఉన్నందున అవి రాష్ట్రాలమద్య...ప్రజల మద్య శతృత్వం అన్నట్లు సాగాయి. కానీ ఇప్పుడు కేసీఆర్‌, జగన్ మద్య మంచి సఖ్యత ఉండటంతో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల మద్య సంబందాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. పరస్పరం సహకరించుకొంటూ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాయి. 

తెలంగాణలో నల్గొండ తదితర ప్రాంతాలకు, ఏపీలోని రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేందుకు గోదావరి మిగులు జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్‌లలోకి మళ్లించాలనే సిఎం కేసీఆర్‌ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల సాగునీటి నిపుణులు, ఇంజనీర్లు చర్చిస్తున్నారు. 

ఇదే అంశంపై నిన్న ఏపీ అసెంబ్లీలో కూడా చర్చ జరిగినప్పుడు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆ చర్చలో పాల్గొన్న సిఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడు కంటే తెలంగాణ సిఎం కేసీఆరే మంచివాడని ప్రశంశించారు. చంద్రబాబునాయుడు వలన ఏపీకి నష్టమే తప్ప ఎటువంటి లాభమూ కలుగలేదని కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ మన ఆంధ్రప్రదేశ్‌కు మంచినీళ్లు ఇవ్వడానికి స్వయంగా ముందుకు వచ్చారని ప్రశంసించారు. పొరుగురాష్ట్రం మనతో ఇంత సఖ్యతగా ఉంటూ సహకరిస్తుంటే దానిపై కూడా చంద్రబాబునాయుడు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని సిఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు వలన ఏపీకి చాలా మేలు కలుగుతుందని నమ్మబట్టే ముందుకు సాగుతున్నామని జగన్ అన్నారు. భవిష్యత్తులో పెరిగే నీటి అవసరాలను, నీటికొరతను దృష్టిలో పెట్టుకునే అడుగు ముందుకు వేస్తున్నామని జగన్ వాదించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వార్ధరాజకీయాలే ముఖ్యమని భావిస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు. ఆయన కంటే ఏపీకి మేలు చేయాలనుకొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ చాలా మంచివారని అన్నారు.