ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు–2019 (ట్రిపుల్‌ తలాక్‌)కు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. గత లోక్‌సభలో కూడా దీనిని ఆమోదించినప్పటికీ రాజ్యసభ ఆమోదం పొందకపోవడంతో కేంద్రప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దానికి శాశ్వితంగా చట్టబద్దత కల్పించేందుకు మళ్ళీ నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొంది. కాంగ్రెస్‌, డీఎంకె, మజ్లీస్, తదితర ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిని వ్యతిరేకిస్తూ మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో తీవ్రంగా వాదించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు సూచించిన సవరణలు వీగిపోయాయి. అలాగే దీనిపై మరింత లోతుగా పరిశీలించి తగిన మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ బిల్లును స్థాయి సంఘానికి పంపించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 302, వ్యతిరేకంగా 75 ఓట్లు రావడంతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ దీనిని రాజ్యసభ కూడా ఆమోదించిన తరువాతే చట్టరూపం దాల్చుతుంది. నేడో రేపో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. 

సమాచారం హక్కు చట్టం (ఆర్‌టిఐ) సవరణలకు నిన్న రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీనిలో ఆర్‌టిఐ ప్రధాన కమీషనర్ తదితరుల జీతభత్యాలు, సర్వీస్ నిబందనలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రప్రభుత్వానికి అప్పగించబడింది. తద్వారా ఆర్‌టిఐను కేంద్రప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకొని ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోందని ప్రతిపక్షాలు వాదించాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. 

ప్రతిపక్షాల సూచన మేరకు పార్లమెంటు సమావేశాలను ఆగస్ట్ 7వ తేదీ వరకు పొదిగిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం లోక్‌సభలో ప్రకటించారు.