ముస్లింల సంక్షేమం కోసం మజ్లీస్ ఏమి చేసింది? బిజెపి ప్రశ్న

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బిజెపి, ఆర్ఎస్ఎస్‌లపై మంగళవారం కరీంనగర్‌లో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బిజెపి ఎంపీలు బండి సంజయ్, దర్మపురి అరవింద్ ధీటుగా స్పందించారు. ఓవైసీ సోదరులిద్దరూ ముస్లింల ప్రతినిధులమని చెప్పుకోంటూ ప్రజలలో మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడం తప్ప ముస్లింల సంక్షేమం కోసం ఏమి చేశారని వారు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ ముస్లిం మహిళల సంక్షేమం కోసం ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చి వారి జీవితాలకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే, మజ్లీస్ పార్టీ దానిని వ్యతిరేకిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. దురదృష్టవశాత్తూ ప్రజలు ఓవైసీ సోదరులను ఎన్నుకొన్నారని వచ్చే ఎన్నికలలో వారిని పక్కన పెట్టబోతున్నారని అన్నారు. హిందువుల అంతు చూస్తామని బెదిరిస్తున్న మజ్లీస్ పార్టీతో తెరాస దోస్తీ పెట్టుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో హైదరాబాద్‌లో అనేక అరాచకాలకు పాల్పడుతున్నాయని, కేంద్రప్రభుత్వం వాటిపై దృష్టి సారిస్తుందని అన్నారు. ఓవైసీ సోదరులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తున్న హిందూ, ముస్లింల మద్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోమని ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.