ఏపీలో 11,114 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌

ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇటీవలే గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం తాజాగా 11,114 మంది గ్రామ సర్వేయర్ల శాశ్విత ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు సిద్దం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 11,114 గ్రామసచివాలయాలకు ఒక్కో సర్వేయర్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని గ్రామ అసిస్టెంట్ సర్వేయర్ గ్రేడ్-3 పోస్టులుగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు, వయోపరిమితి, విధివిధానాలు తదితర అంశాలపై ఏపీ రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మన్మోహన్ ఉన్నతాధికారులతో బుదవారం అమరావతిలో సమావేశం నిర్వహించి ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన ముందస్తు కసరత్తు అంతా పూర్తి చేశారు. ఈ శనివారంలోగానే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. 

జగన్ ప్రభుత్వం ఇంత వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుండటంతో రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేసమయంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలకు నేరుగా నెలనెలా ప్రభుత్వం డబ్బు చెల్లిస్తే ప్రతిపక్షాల విమర్శలు, న్యాయసమస్యలు వస్తాయనే ఆలోచనతోనే గ్రామవాలంటీర్ల పేరుతో   వారికి అధికారికంగా నెలకు రూ.5,000 జీతం చెల్లించడానికి జగన్ ప్రభుత్వం సిద్దం అవుతోందని టిడిపి విమర్శిస్తోంది. గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ ఉండగా కొత్తగా గ్రామ సచివాలయాల ఏర్పాటుతో వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయం కూడా అనాలోచితమైనదేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. తాజాగా గ్రామ సర్వేయర్ల నియామకాలపై కూడా అధికారులే సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. “ఒకసారి గ్రామాలలో సర్వే పూర్తి చేసిన తరువాత వారికి ఇక పనేమీ ఉంటుంది? అప్పుడు వారు ఏమి చేయాలి?” అని ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం చాలా చురుకుగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పటికీ ఇటువంటి సందేహాలు, విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు.