ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు?

రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని సిఎం కేసీఆర్‌, మాజీ ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని  కేంద్రప్రభుత్వం, ఇప్పుడు ఎవరూ అడగకుండానే దాని కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి సమాచారహక్కు క్రింద ఈసీని దీనికి సంబందించి వివరాలు కోరగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఏపీలో 175 సీట్లు ఉండగా వాటిని  225కి పెంచాలని, అలాగే తెలంగాణలో ఉన్న 119 సీట్లను 153కు పెంచడంపై అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ గత ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రహోంశాఖ  తమకు ఒక లేఖ వ్రాసిందని ఈసీ తెలియజేసింది. కానీ ఆ లేఖపై మరికొంత వివరణ కోరామని ఈసీ తెలియజేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రంలోను 2026 వరకు అసెంబ్లీ సీట్లను పెంచే ఉద్దేశ్యం లేదని పదేపదే పార్లమెంటులో చెప్పిన కేంద్రప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ఈసీకి ఎందుకు లేఖ వ్రాసిందో?తెలియదు కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని బిజెపి కలలు కంటోంది కనుక అసెంబ్లీ సీట్ల పెంపువలన బిజెపికి రాజకీయంగా లబ్ధి కలుగుతుందనుకుంటే తప్పకుండా పెంచవచ్చు.