సచివాలయ నిర్మాణానికి జోరుగా కసరత్తు

ప్రస్తుత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలనే సిఎం కేసీఆర్‌ ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు న్యాయపోరాటాలు మొదలుపెట్టినప్పటికీ, గవర్నర్‌ నరసింహన్‌కు, కేంద్రప్రభుత్వానికి పిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గే ఆలోచన లేదన్నట్లు తెరాస సర్కార్ ముందుకు సాగుతోంది. 

దేశంలో 20 మంది ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థలు పంపిన కొత్త సచివాలయ భవనం డిజైన్లను టెక్నికల్ టీమ్ పరిశీలిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిభింబించేవిధంగా ఉండే డిజైన్లు కావాలని ముందే సూచించడంతో అందుకు తగ్గ నమూనాలనే ఆర్కిటెక్ట్ సంస్థలు తయారుచేసి పంపించాయి. వాటిలో అత్యుత్తమైన నమూనాను ఎంపిక చేసుకొని సిఎం కేసీఆర్‌కు సమర్పిస్తారు. ఆయన సూచనల మేరకు అవసరమైతే మళ్ళీ దానిలో మళ్ళీ మార్పులు చేర్పులు చేయిస్తారు. సచివాలయం నమూనా ఖరారవగానే భవన నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెరాస సర్కార్ భావిస్తోంది. ఆలోగా ప్రస్తుత సచివాలయంలోని ప్రభుత్వ కార్యాలయాలను సమీపంలో గల బీఆర్కె భవన్‌లోకి తరలించే ప్రక్రియ కూడా పూర్తయి అక్కడి నుంచే తాత్కాలిక సచివాలయం పని ప్రారంభిస్తుంది కనుక సచివాలయం కూల్చివేసినా ప్రభుత్వ నిర్వహణ, పాలనకు ఎటువంటి ఆటంకం ఉండదు. 

కానీ సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేయకుండా స్టే విధించింది. ఈ సమస్యను ముందే ఊహించిన తెరాస సర్కార్ ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని వేసింది. సచివాలయం కూల్చివేయాలని సిఎం కేసీఆర్‌ ముందే నిర్ణయించుకున్నారు కనుక ఆ కమిటీ అందుకు అనుగుణంగానే నివేదిక ఇస్తుందని వేరే చెప్పనక్కరలేదు. హైకోర్టును ఒప్పించేందుకు కూడా ఆ నివేదిక ఉపయోగపడుతుంది. కనుక సచివాలయం కూల్చివేతపై హైకోర్టు అభ్యంతరం చెప్పకపోవచ్చు.      

ఈ అంశంపై రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో...దాని నిధులతో చేపడుతున్న పని గనుక కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోకపోవచ్చు. కనుక ఈ విషయంలో హైకోర్టు, కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవనే ధైర్యంతోనే తెరాస సర్కార్ ముందుకు సాగుతునట్లు భావించవచ్చు. తెరాస సర్కార్ ఎప్పుడు ఏ పని మొదలుపెట్టినా ఇటువంటి వ్యతిరేక పరిస్థితులే ఎదురవుతుండటం, వాటిని అధిగమించి ముందుకు సాగుతుండటం ఆనవాయితీగా మారినట్లు కనిపిస్తోంది.