
ఏపీకి బిశ్వభూషన్ హరిచందన్ కొత్త గవర్నర్‌గా నియమితులవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను సోమవారం విజయవాడలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో తనకున్న అనుబందాన్ని గుర్తుచేసుకొని, ఏపీని విడిచిపెట్టి వెళ్ళిపోవలసివస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. జగన్ పదేళ్ళు ప్రాక్టీస్ చేసి బ్యాటింగ్ కు దిగి సిక్సర్లు, బౌండరీలు కొడుతున్నట్లు పాలిస్తున్నారని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. జగన్ 34 రోజుల పాలనను టి-20 క్రికెట్ మ్యాచ్‌లాగ చాలా రసవత్తరంగా సాగుతోందని అన్నారు. జగన్ పాలనలో అనేక సెంచరీలు చేయాలని కోరుకొంటున్నానని అన్నారు. అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసెంబ్లీ నియామవళికి అనుగుణంగా సాగుతోందన్నారు. ప్రతీ అంశంపై లోతుగా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న మంచి పాలకుడు జగన్ అని ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుకొంటున్నానని అన్నారు.
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించారు. గవర్నర్ నరసింహన్ ఒక తండ్రిలాగా చెయ్యి పట్టుకొని నడిపించి తనకు మార్గదర్శనం చేశారని అటువంటి వ్యక్తి వెళ్లిపోతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. కానీ ఆయన హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండటం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. ఆయన చెప్పిన సలహాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తానని అన్నారు.