గమనిక: నేను పార్టీ మారడం లేదు

గత తెరాస ప్రభుత్వంలో ఒక వెలుగువెలిగిన మంత్రులు, పార్టీలో సీనియర్లు ఇప్పుడు పెద్దగా కనబడటం లేదు. వారిలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఒకరు. ఈ ఫిరాయింపుల యుగంలో ఎవరైనా ఒక ముఖ్యనేత కనబడకపోతే అనుమానించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తోడు మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని ఆ నేతలు పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానం వినిపించగానే అది కార్చిచ్చులా వ్యాపిస్తుంటుంది. ఇటీవల మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిని ఆయన ఖండించారు. తాను పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదని, కనుక పదవులు ఉన్నా లేకపోయినా తెరాసలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. 

ఇప్పుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కూడా అటువంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కొల్లాపూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి తెరాస కార్యక్రమాలలో ఆయన పెద్దగా కనబడటం లేదు. దాంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అవి ఆయన దృష్టికి రావడంతో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఖండించారు. 

“నేను పూటకో పార్టీ మారే వ్యక్తిని కాను. ప్రతిపక్షాలలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే నాపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో తెరాసలో పనిచేస్తాను. నేను ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ నా నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నాను. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సహకారంతో నా నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.