ఏపీకి కొత్త గవర్నర్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఒడిశాకు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు, ప్రముఖ రచయిత, ప్రముఖ న్యాయవాది ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన నియామకంతో నరసింహన్‌ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరిస్తారు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి కూడా కేంద్రప్రభుత్వం ఈరోజు కొత్త గవర్నర్‌గా ఆనంద్ ఊకేను నియమించింది. ప్రస్తుతం కొత్త గవర్నర్ల నియామకాలు జరుగుతున్నందున, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను కూడా త్వరలో ఈశాన్యరాష్ట్రాలకు లేదా జమ్ముకశ్మీర్‌కు బదిలీ చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆయన స్థానంలో తెలంగాణ గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి తెరాసకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలనుకుంటోంది కనుక అందుకు సహకరించే వ్యక్తినే ఏరికోరి నియమించే అవకాశం ఉండవచ్చు.