గవర్నరుగా మీ సత్తా చూపండి: జానారెడ్డి

సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు సోమవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సెక్షన్ 8 ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు గవర్నర్‌ కస్టోడియన్‌ కనుక, సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని వారు నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపోయిన సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి సరిపోదనుకోలేమని, ఎంతోమంది ముఖ్యమంత్రులు వినియోగించుకున్న సచివాలయాన్ని కేవలం మూడనమ్మకాలతో కూల్చుకోవడం సరికాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ తన అధికారాన్ని వినియోగించి సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. త్వరలో గవర్నర్‌ మార్పు జరుగవచ్చన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో, గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ ప్రభుత్వానికి తన ఉనికిని గుర్తు చేసేలా వ్యవహరించాలని జానారెడ్డి కోరారు.

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌ రెడ్డి, జి.వివేక్, టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తదితరులున్నారు.     

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ గవర్నర్‌ నరసింహన్‌ భవనాల కూల్చివేతను అడ్డుకొనే ప్రయత్నం చేయకపోతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే బదులు, సిఎం కేసీఆర్‌ ఎప్పుడూ కొత్త భవనాలను కట్టడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, ప్రజలకు తన పేరు ఎప్పటికీ గుర్తుండిపోవాలనే కోరికతోనే సిఎం కేసీఆర్‌ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎల్ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు.