
తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్లు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం నుంచి ‘వర్క్-టు-రూల్’ (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధి నిర్వహణ) చేస్తామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో వారిలో 18 మందిని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. కానీ ఇప్పుడు వారు సమ్మె బాట పట్టడంతో తక్షణమే వారిని ఆ భాద్యతల నుంచి తొలగించి వారిస్థానంలో ఎంపీడీవోలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్ల సమ్మె కారణంగా మున్సిపల్ ఎన్నికలలో ఎటువంటి సమస్యలు, అవరోధాలు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతో వారిని తప్పించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించకుండా తమపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని తహసీల్దార్ల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 15లోగా ప్రభుత్వం తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే 15వ తేదీ నుంచి సామూహిక శలవులు పెడతామని నోటీసులో పేర్కొన్నారు. తెరాస చాలా కీలకంగా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ముందు తహసీల్దార్లు సమ్మె బాట పట్టడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.