
కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం కోసం సచివాలయం, ఎర్రమంజిల్లోని చారిత్రిక కట్టడాల కూల్చివేయాలనుకొంటున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో తాజాగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నిటిపై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు, తక్షణమే కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తరువాత మళ్ళీ ఈ పిటిషన్లపై విచారణ జరుపుతామని, అప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వ వాదనలు వినిపించవలసి ఉంటుందని చెప్పి ఈ కేసును 2.15 గంటలకు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు సచివాలయం, ఎర్రమంజిల్లోని చారిత్రిక కట్టడాలను కూల్చవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొన్ని రోజుల క్రితం ఇదే కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. కానీ ఈరోజు అందుకు భిన్నంగా భవనాల కూల్చివేతను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.