అటవీఅధికారులపై అట్రాసిటీ కేసులు!

పదిరోజుల క్రితం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని కొత్త సార్సాల గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీశాఖ అధికారులపై తెరాస నేత కోనేరు కృష్ణారావు నేతృత్వంలో గ్రామస్తులు కర్రలతో దాడి చేయడం, ఆ దాడిలో మహిళా అటవీశాఖ అధికారిణి అనితతో సహా సిబ్బంది గాయపడటం, సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో కృష్ణారావుపై తక్షణం వేటు వేసి దాడికి పాల్పడినవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిందే. 

కానీ ఆ ఘటనల తరువాత తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ కేసు నుంచి తన సోదరుడు కృష్ణారావును బయటపడేసేందుకు గ్రామస్తులకు బ్రీఫింగ్ ఇస్తున్న వీడియో మీడియాలో వచ్చినప్పుడు తెరాస సర్కారు ఇబ్బంది పడింది. రెండు రోజుల క్రితం కొత్తసార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ అటవీశాఖ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన ప్రయత్నాలు మానుకోలేదని స్పష్టం అయ్యింది. వారు తమను కులం పేరుతో దూషించారని ఆమె ఫిర్యాదు చేయడంతో అస్గాం పోలీసులు అనితతో సహా 15 మంది అటవీశాఖ సిబ్బందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

కొత్తసార్సా గ్రామంలో జరిగిన ఘటనలపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలుగజేసుకొని చర్యలు తీసుకోవడమే కాకుండా అటవీశాఖాధికారిణి అనితకు గన్ మ్యాన్లతో రక్షణ కూడా కల్పించారు. కానీ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కోనప్ప వెనక్కు తగ్గే ఉద్దేశ్యం లేనట్లే ఉంది. ఈ తాజా పరిణామాలపై మళ్ళీ సిఎం కేసీఆర్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.